హుస్నాబాద్‌లో ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ

అక్కన్నపేట: దివ్యాంగులు, వయోవృద్ధులకు ఉచిత సహాయ ఉపకరణాలు అందించేందుకు అలింకో ఏర్పాటు చేసిన నిర్ధారణ శిబిరాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ నవంబర్ 18న ప్రారంభించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ట్రై సైకిళ్లు, బ్యాటరీ వాహనాలు, కృత్రిమ అవయవాలు, వినికిడి యంత్రాలు తదితర ఉపకరణాలను అర్హులకు ఉచితంగా అందిస్తామని చెప్పారు. 20న కోహెడ, 21న చిగురుమామిడి, 25, 26 తేదీల్లో హుస్నాబాద్, 27న భీమదేవరపల్లిలో శిబిరాలు ఉంటాయని తెలిపారు.

హుస్నాబాద్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

అక్కన్నపేట–హుస్నాబాద్ నాలుగు లైన్ల రహదారి టెండర్లు పూర్తయ్యాయని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. గౌరవెల్లి, గండిపెల్లి రిజర్వాయర్ల భూసేకరణకు రూ.250 కోట్లు కేటాయించి రైతులకు పరిహారం చెల్లించామని పేర్కొన్నారు.

గౌరవెల్లి ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని, పూర్తి చేసే బాధ్యత తనదేనని చెప్పారు. 19న సిద్దిపేటలో ఇందిరమ్మ చీరల పంపిణీతోపాటు కుటుంబ బీమా పథకం ప్రారంభించనున్నట్లు తెలిపారు. సభకు హుస్నాబాద్ ప్రజలు పెద్ద సంఖ్యలో రావాలని పిలుపునిచ్చారు.