హైదరాబాద్: రబీ సీజన్‌లో విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్టు ముందుగానే సిద్ధమై, రైతులు సహా అన్ని వర్గాలకు నిరంతరం సరఫరా చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులకు కూడా కోతలు ఉండకూడదని స్పష్టం చేశారు.
ప్రజాభవన్‌లో సోమవారం ఆయన రాష్ట్ర విద్యుత్ పరిస్థితిని సమీక్షించారు. ఇంధన శాఖ, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్‌పీడీసీఎల్) అధికారులు ఈ భేటీకి హాజరయ్యారు. పెరుగుతున్న డిమాండ్, సరఫరా నిర్వహణ, మౌలిక వసతుల విస్తరణపై చర్చ జరిగింది. రబీకి సంస్థలు ఎంతవరకు సిద్ధంగా ఉన్నాయో కూడా భట్టి ఆరా తీశారు.
ఎల్‌నినో వల్ల వర్షాలు తక్కువగా పడినా రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను సమర్థంగా నడిపిస్తున్నామని ఆయన తెలిపారు. డిమాండ్ రికార్డు స్థాయికి చేరినప్పటికీ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చూసిన విద్యుత్ సంస్థలను అభినందించారు.
రాష్ట్రంలో అక్టోబర్ 16న విద్యుత్ డిమాండ్ 20,018 మెగావాట్లకు చేరి ఆల్‌టైమ్ రికార్డు నమోదైందని భట్టి చెప్పారు. మరుసటి రోజు కూడా డిమాండ్ 20,003 మెగావాట్లుగా ఉందని తెలిపారు. ఆ రెండు రోజులూ సంస్థలు సమర్థంగా సరఫరా చేశాయన్నారు.
విద్యుత్ డిమాండ్ ఏటా పెరుగుతోందన్న డిప్యూటీ సీఎం
రాష్ట్రంలో ఏటా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోందని భట్టి వివరించారు. గత ఏడాది నవంబర్ 16న గరిష్ఠ డిమాండ్ 8,522 మెగావాట్లు కాగా, ఈ ఏడాది అదే రోజు 12,802 మెగావాట్లకు పెరిగిందని చెప్పారు. ఇందులో టీజీఎస్‌పీడీసీఎల్ పరిధిలో 8,859 మెగావాట్లు, ఎన్‌పీడీసీఎల్ పరిధిలో 3,595 మెగావాట్లు నమోదయ్యాయన్నారు.
వర్షాభావం వల్ల జలవిద్యుత్ ఉత్పత్తిలో దాదాపు 4,000 మెగావాట్ల లోటు ఏర్పడిందని ఆయన గుర్తుచేశారు. అయినా ఖరీఫ్‌లో రైతులు సహా అందరికీ ఇబ్బంది లేకుండా విద్యుత్ ఇవ్వడం అభినందనీయమన్నారు.
మరోవైపు పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టు సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని అధికారులు వివరించారు. బడంగ్‌పేట, దావూద్‌ఖాన్‌గూడలో రెండు కొత్త 33/11 కేవీ సబ్‌స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. వీటితో సరూర్‌నగర్ సర్కిల్‌లో పెరుగుతున్న డిమాండ్ తీరుతుందని చెప్పారు. అక్కడ విద్యుత్ సరఫరా మరింత నాణ్యంగా, నమ్మకంగా ఉంటుందన్నారు.
రబీలో ఎక్కువ రోజులు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని భట్టి అన్నారు. అందువల్ల డిమాండ్ ఒక్కసారిగా పెరిగే పరిస్థితులను ముందే అంచనా వేయాలని సూచించారు. డిమాండ్‌పై నిరంతరం కన్నేసి ఉంచి, కావాల్సిన విద్యుత్‌ను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఏ వర్గానికీ సరఫరాలో అంతరాయం రాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్ పాల్గొన్నారు. డైరెక్టర్లు శివాజీ, చక్రపాణి, నరసింహ తదితర అధికారులు కూడా హాజరయ్యారు.
