హైదరాబాద్: సింగరేణిలో కేటీఆర్ మూడు సభలు విజయవంతం కావడంతోనే కాంగ్రెస్ నేతలు ఆయనను లక్ష్యంగా చేసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ నేత ఒంటెద్దు నరసింహారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ ప్రస్తావించాకే సింగరేణి కార్మికులకు ప్రభుత్వం 34 శాతం లాభాల వాటా ప్రకటించిందన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కేటీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల కొన్న డిఫెండర్ కారును పాఠశాల విద్యార్థి అయిన కొడుకు కొనిచ్చాడన్న ఎమ్మెల్యే వాదనను ప్రశ్నించారు.
బీర్ల ఐలయ్యపై గాదరి కిశోర్ ఆరోపణలు
భూ లావాదేవీల్లో ఐలయ్య ప్రజలను మోసం చేశారని, బీఆర్ఎస్ హయాంలోని యాదాద్రి పనుల ఘనతను తనదిగా చెప్పుకుంటున్నారని కిశోర్ ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఆయన అక్రమాలపై విచారణ జరిపిస్తామని హెచ్చరించారు.
ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. భారత్ సమ్మిట్ పేరుతో ప్రజాధనం దుర్వినియోగమవుతోందని ఆరోపించారు.
