హైదరాబాద్: సమాన అభివృద్ధి, ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మరియు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. భారత్ సమ్మిట్లో ‘తెలంగాణ రైజింగ్ – ఎకనామిక్ జస్టిస్’ అంశంపై మాట్లాడారు.
రాష్ట్ర ఆదాయంలో 40 శాతం హైదరాబాద్ నుంచే వస్తోందని, ఇది అభివృద్ధిలో అసమతుల్యతకు నిదర్శనమని పేర్కొన్నారు. ఆదిలాబాద్, ములుగు, నారాయణపేటలోనూ పరిశ్రమలు రావాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 80 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించామని చెప్పారు.
కేంద్రం, బీఆర్ఎస్పై మహేష్ కుమార్ గౌడ్ విమర్శలు
సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ హయాంలో ప్రారంభమైన ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, వాటిపై ఏటా రూ.6,500 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నామని చెప్పారు.
పేదలకు సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లకు రూ.5 లక్షల సాయం, దాదాపు 70 శాతం కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వివరించారు.
