హైదరాబాద్: నషా ముక్త్ భారత్ యాత్ర తొలి దశ నవంబర్ 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్ అంతటా జరగనుంది.
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి నేతృత్వంలో ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ పేరుతో ఈ యాత్ర సాగుతుంది. ఈ యాత్ర సన్నాహాల్లో భాగంగా ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో మేధావుల సదస్సు జరిగింది. కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
యువతపై మాదకద్రవ్యాల దుష్ప్రభావాన్ని చూపిన స్కిట్ ప్రేక్షకులను కదిలించింది. ఆ తర్వాత పాల్గొన్నవారు మాదకద్రవ్య రహిత సమాజం కోసం పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
నషా ముక్త్ భారత్ యాత్రలో అందరూ భాగం కావాలి: కిషన్ రెడ్డి
2029 నాటికి దేశాన్ని మాదకద్రవ్య రహితంగా మార్చేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజా ఉద్యమం ప్రారంభించిందని కిషన్ రెడ్డి మీడియాతో అన్నారు. కళాకారులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు ఈ ఉద్యమంలో చేరాలని పిలుపునిచ్చారు. విద్యా సంస్థలు, మీడియా ప్రతినిధులు, మేధావులు సహా అన్ని వర్గాలు భాగం కావాలని కోరారు.
యువతే దేశానికి అతిపెద్ద బలమని ఆయన చెప్పారు. అయితే మాదకద్రవ్యాల వినియోగం దేశ భవిష్యత్తుకు తీవ్ర ముప్పుగా మారిందని హెచ్చరించారు. ఈ సమస్యను ప్రభుత్వం, పోలీసులకే వదిలేయకుండా సమష్టిగా ఎదుర్కోవాల్సిన సవాల్‌గా గుర్తించాలని కోరారు.
రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. మేజర్ జనరల్ వి.ఆర్. మహేంద్ర (రిటైర్డ్), డాక్టర్ సిద్ధార్థ రెడ్డి, జేఎన్టీయూ ప్రతినిధి కిషన్ కుమార్ రెడ్డి, మానసిక వైద్యుడు డాక్టర్ సుధాకర్ కూడా పాల్గొన్నారు. పలువురు విద్యావేత్తలు, ఎన్జీవో ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు కూడా హాజరయ్యారు.
