హైదరాబాద్: నగరంలో ఇంకుడు గుంతల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ఆలివ్ మిఠాయి సంస్థ రూ.10 లక్షల బహుమతులతో ప్రత్యేక పోటీ నిర్వహిస్తోంది. ‘ఆలివ్ మిఠాయి – ఇంటికో ఇంకుడు గుంత’ కార్యక్రమ పోస్టర్‌ను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం హైడ్రా కార్యాలయంలో ఆవిష్కరించారు.
వర్షపు నీటిని భూమిలోకి ఇంకించడం ద్వారా భూగర్భ జలాలను పెంచుకోవచ్చని రంగనాథ్ తెలిపారు. వర్షాకాలంలో వరదల ప్రభావం తగ్గించడంతోపాటు వేసవిలో నీటి ఎద్దడిని నివారించేందుకు ఇంకుడు గుంతలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
విజేతలకు రూ.10 లక్షల బహుమతులు
ఇంకుడు గుంత తవ్విన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లోని oliveforsociety పేజీకి కొలాబ్ పోస్ట్ చేసి, ఆ పేజీని ఫాలో కావాలని సంస్థ యజమాని దొర రాజు సూచించారు. అత్యధిక వ్యూస్ సాధించిన వీడియోలకు మొదటి బహుమతిగా రూ.5 లక్షలు, రెండో బహుమతిగా రూ.3 లక్షలు, మూడో బహుమతిగా రూ.2 లక్షలు అందజేయనున్నారు.
సేవ్ వాటర్! సేవ్ ఎర్త్!, ట్రీ గార్డ్ సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యాయి. నగర చెరువుల పునరుద్ధరణకు కృషి చేస్తున్న హైడ్రా కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలని దొర రాజు కోరారు. విజేతలకు హైడ్రా కమిషనర్ చేతుల మీదుగా బహుమతులు అందజేస్తామని తెలిపారు.
