అవర్ వరల్డ్ ఇన్‌స్టిట్యూట్ గ్లోబల్ థింక్ ట్యాంక్‌గా

హైదరాబాద్: ‘అవర్ వరల్డ్ ఇన్‌స్టిట్యూట్ ‘ను అంతర్జాతీయ వ్యవహారాలపై ప్రముఖ గ్లోబల్ థింక్ ట్యాంక్‌గా తీర్చిదిద్దుతామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శనివారం ప్రకటించారు.

విధాన పరిశోధన, ప్రపంచ సవాళ్లకు పరిష్కారాలపైనా ఈ సంస్థ దృష్టి పెడుతుందని చెప్పారు. హైటెక్స్‌లో జరిగిన ‘భారత్ సమ్మిట్ – 2026’ ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆలోచనలు, దార్శనికతను ఆచరణీయ విధానాలుగా మార్చేందుకు సమ్మిట్ వేదికగా అవర్ వరల్డ్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించామని తెలిపారు.

ఆలోచనలను విధానాలుగా మార్చనున్న అవర్ వరల్డ్ ఇన్‌స్టిట్యూట్

సమ్మిట్‌లో భాగంగా హెచ్ఐసీసీలో 12 అంతర్జాతీయ ప్యానెల్ చర్చలు జరిగాయని శ్రీధర్ బాబు చెప్పారు. హైటెక్స్‌లో ‘తెలంగాణ రైజింగ్’ పేరుతో ఎనిమిది ప్రత్యేక సెషన్లు కూడా నిర్వహించామన్నారు. ప్రపంచ ప్రతినిధులు, మేధావులు, నిపుణులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రపంచ ఆర్థిక సమానత్వం, వాతావరణ మార్పులపై చర్చించారు. ప్రపంచ శాంతి, మీడియా భవిష్యత్తు, ప్రజాస్వామ్య సంస్థల దృఢత్వంపైనా చర్చలు సాగాయి.

విభిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ, న్యాయమైన ప్రపంచ వ్యవస్థ నిర్మాణంపై ఏకాభిప్రాయం వచ్చిందని ఆయన అన్నారు. ఆ వ్యవస్థ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, మనిషి కేంద్రంగా ఉండాలని చెప్పారు.

సమ్మిట్ నిర్వహణతో తెలంగాణకు ప్రపంచ గుర్తింపుతో పాటు బాధ్యత కూడా వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచ అనుసంధానం, సామాజిక న్యాయం కలిసి సాగగలవని రాష్ట్రం నిరూపిస్తోందని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమాన్ని పౌరుల ఆత్మగౌరవంతో సమతుల్యం చేస్తోందని అన్నారు.

డిసెంబర్ 7 నుంచి 9 వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0’కు దేశ, విదేశీ ప్రతినిధులను ఆయన ఆహ్వానించారు.