హైదరాబాద్: కొల్లాపూర్ నియోజకవర్గ సాగునీటి అవసరాల కోసం చేపట్టిన గోపాలదిన్నె–సింగోటం లింక్ కెనాల్ పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం రాత్రి సమీక్షించారు. కొల్లాపూర్ క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో సమావేశమయ్యారు.
పూర్తయిన పనులు, పెండింగ్‌లో ఉన్న కాలువ నిర్మాణ భాగాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనుల పురోగతికి అడ్డంకులుగా ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
గోపాలదిన్నె–సింగోటం లింక్ కెనాల్‌పై సమీక్ష
రెండు రిజర్వాయర్లను అనుసంధానించి, చివరి ఆయకట్టు వరకు నీరు చేరేలా చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీనివల్ల కొల్లాపూర్ ప్రాంత రైతుల సాగునీటి అవసరాలు తీరనున్నాయి. నిర్మాణంలో జాప్యం వల్ల రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని జూపల్లి స్పష్టం చేశారు.
ప్రాజెక్టుకు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనుల వేగం కొనసాగించాలని ఆదేశించారు. నిర్మాణానికి ఆటంకాలు ఎదురైతే వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని చెప్పారు. రైతులకు నీరు అందించే విషయంలో సమస్యలు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
