బాల్మూరి వెంకట్ ప్రమాదం.. నలుగురికి స్వల్ప గాయాలు

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ బాల్మూరి వెంకట్ కారు బుధవారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా కొత్తూరు జంక్షన్ సమీపంలో ప్రమాదానికి గురైంది. తిరుపతి నుంచి భార్యతో కలిసి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఆయన వాహనాన్ని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో వెంకట్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కోళ్లను తరలిస్తున్న డీసీఎం వ్యాన్‌ను ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. కారులో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి.

బాల్మూరి వెంకట్ ప్రమాదం.. తప్పిన పెను ముప్పు

వెంకట్, ఆయన భార్యతో పాటు తమ్ముడు చాణక్య, కారు డ్రైవర్ శ్రీకాంత్ కూడా వాహనంలో ఉన్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ నలుగురూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఎవరికీ తీవ్ర గాయాలు కాకపోవడంతో కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.

సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారికి ప్రాథమిక సహాయం అందించడంతో పాటు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెనుక నుంచి వచ్చిన కారు వేగమే ప్రమాదానికి కారణమైనట్లు ప్రాథమిక సమాచారం.