హెచ్‌పీవీ టీకా డోసులు కోటి దాటడంపై మోదీ ప్రశంస

హైదరాబాద్: దేశంలో హెచ్‌పీవీ టీకా డోసులు కోటి దాటడం నివారణ ఆరోగ్య సంరక్షణ దిశగా సాగుతున్న ప్రయాణంలో ముఖ్యమైన మైలురాయి అని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు. ప్రతి డోసూ బాలికలను గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి రక్షించే దిశగా, వారి ఆరోగ్యకరమైన భవిష్యత్తు దిశగా వేసే అడుగేనని ఆయన రాశారు.

ఈ ఘనత వెనుక కృషి చేసిన భాగస్వాములందరినీ మోదీ అభినందించారు. ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నవంబర్ 21న చేసిన పోస్టుకు స్పందిస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఏటా టీకాకు అర్హత పొందే బాలికల్లో దాదాపు 87 శాతం మందికి ఇప్పటికే టీకా అందిందని నడ్డా ఆ పోస్టులో వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్, ఉత్తరప్రదేశ్, మిజోరం, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు 100 శాతం కవరేజీ సాధించినందుకు నడ్డా అభినందనలు తెలిపారు. అలాగే 12 రాష్ట్రాల్లో కవరేజీ 80 శాతం దాటిందని ఆయన పేర్కొన్నారు.

9 నెలలు నిండకముందే కోటి దాటిన హెచ్‌పీవీ టీకా డోసులు

ప్రధాని మోదీ ప్రారంభించిన జాతీయ హెచ్‌పీవీ టీకా కార్యక్రమం 9 నెలలు నిండకముందే కోటి డోసుల మైలురాయిని అందుకుందని నడ్డా వివరించారు.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, వైద్య నిపుణులు, క్షేత్రస్థాయి ఆరోగ్య కార్యకర్తలు, తల్లిదండ్రుల సమష్టి నిబద్ధతకు ఈ పురోగతి నిదర్శనమని నడ్డా అన్నారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లేని భవిష్యత్తు దిశగా దేశం అడుగులు వేస్తోందని కూడా ఆయన చెప్పారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, యూ-విన్ ద్వారా అర్హులైన 14 ఏళ్ల బాలికలకు ఒకే డోసు హెచ్‌పీవీ టీకా ఉచితంగా అందుబాటులో ఉందని మంత్రి తెలిపారు. ఈ టీకా సురక్షితమైనది, ప్రభావవంతమైనది అని ఆయన పేర్కొన్నారు.