హైదరాబాద్: తెలంగాణ నీటి హక్కుల విషయంలో బీఆర్ఎస్ నిరాధార ఆరోపణలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. కాంగ్రెస్‌లో విభేదాలున్నాయన్న వార్తలను తోసిపుచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడుతోందని చెప్పారు.
గాంధీ భవన్‌లో ఏఐసీసీ కొత్త తెలంగాణ ఇన్‌చార్జి బీఎం సందీప్ కుమార్‌ను కలిసిన అనంతరం భట్టి మీడియాతో మాట్లాడారు. పార్టీ సంస్థాగత బలోపేతంపైనే చర్చించామని, విభేదాలే లేనప్పుడు వాటిపై చర్చ ఎందుకని ప్రశ్నించారు.
తెలంగాణ నీటి హక్కులపై బీఆర్ఎస్‌కు భట్టి విమర్శ
నీటి అంశంపై బీఆర్ఎస్ వైఖరి దొంగే దొంగ అన్నట్లుందని భట్టి విమర్శించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఊహాలోకంలో, సోషల్ మీడియాలో ఉంటున్నారని ఎద్దేవా చేశారు.
గత ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను దెబ్బతీసిందని, వాటిని బాగుచేస్తుంటే విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. పేద కుటుంబాలను గుర్తించి సంక్షేమ సాయం అందిస్తున్నామని, బీఆర్ఎస్ అధికారంలోకి రావడం కలగానే మిగులుతుందని పేర్కొన్నారు.
