ఉప్పర్పల్లి: అత్తాపూర్ 183వ నంబర్ పిల్లర్ వద్ద ఉన్న రెండంతస్తుల అక్రమ నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సోమవారం కూల్చివేయడం ప్రారంభించారు. ఈ ప్రాంతం రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అత్తాపూర్ సర్కిల్ కిందకు వస్తుంది. ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా అక్కడ పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.
బీఆర్ఎస్ రాజేంద్రనగర్ అధ్యక్షుడు పోరెడ్డి ధర్మారెడ్డి తమ అపార్ట్మెంట్ ఖాళీ జాగాలో అక్రమంగా భవనం నిర్మించారని ఆరోపిస్తూ పీఎన్ఆర్ అపార్ట్మెంట్స్ నివాసితులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు విచారణ తర్వాత వెలువడిన ఉత్తర్వులకు అనుగుణంగా అధికారులు గతంలో పలు దఫాలు నోటీసులు ఇచ్చారు.
అత్తాపూర్ అక్రమ నిర్మాణంపై కోర్టు ఉత్తర్వుల అమలు
ఆ ఉత్తర్వుల ఆధారంగానే జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది సోమవారం రంగంలోకి దిగి కూల్చివేత మొదలుపెట్టారు. పార్టీలకు అతీతంగా, నిబంధనల మేరకే అక్రమ నిర్మాణాలపై చర్యలు ఉంటాయని టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్ స్పష్టం చేశారు.
కూల్చివేతల విషయంలో ఎవరి పట్లా పక్షపాతం చూపబోమని ఆయన చెప్పారు. కోర్టు ఉత్తర్వులు, నిబంధనలకు లోబడే ఈ చర్యలు చేపడుతున్నామని అధికారులు వివరించారు.
