కృష్ణా జలాల కేటాయింపు

హైదరాబాద్: కృష్ణా జలాల కేటాయింపులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఏపీ రూ.1,200 కోట్ల పల్నాడు వాటర్ గ్రిడ్‌కు తమ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్న ఆరోపణలను సోమవారం విలేకరుల సమావేశంలో ఖండించారు. ఆధారాలతో తిప్పికొడతామన్నారు.

ఈ ప్రాజెక్టును 2022లో అప్పటి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారని, అప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నా అభ్యంతరం చెప్పలేదని అన్నారు. తమ ప్రభుత్వం కేఆర్‌ఎంబీ వద్ద అభ్యంతరం లేవనెత్తిందని, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేశారని చెప్పారు.

కృష్ణా జలాల కేటాయింపు: కేసీఆర్ సంతకాలపై ఆరోపణలు

811 టీఎంసీల్లో తెలంగాణకు 575 టీఎంసీలు దక్కాలని రేవంత్ అన్నారు. 2015 జూన్ 26న కేసీఆర్ ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలకు అంగీకరించారని ఆరోపించారు. “సంతకంతో రాష్ట్ర జల హక్కులకు మరణశాసనం రాశారు” అన్నారు.

2020 జనవరి 29న ఏపీకి 512 టీఎంసీల శాశ్వత కేటాయింపునకు కేసీఆర్ అంగీకరించారని ఆరోపించారు. కేసీఆర్, హరీశ్ రావులే బాధ్యులన్నారు.