కాంగ్రెస్ మేనిఫెస్టో హామీలపై హరీశ్ రావు ఫైర్

హైదరాబాద్: కాంగ్రెస్ మేనిఫెస్టో హామీలను మూడేళ్లయినా అమలు చేయలేదని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి. హరీశ్ రావు మంగళవారం విమర్శించారు. మేనిఫెస్టో విడుదలై మూడేళ్లు పూర్తైన సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి డి. శ్రీధర్ బాబు జవాబు చెప్పాలని నిలదీశారు.

మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌తో పోల్చిన పార్టీ హామీలను మరిచిందని అన్నారు. “అభయ హస్తం ఖాళీ చేయిగా మారింది” అని వ్యాఖ్యానించారు. మొదటి కేబినెట్ సమావేశంలోనే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత ఇస్తామని చెప్పి, 38 సమావేశాలు జరిగినా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ మేనిఫెస్టో హామీలు, ఆరోగ్యశ్రీ బకాయిలు

ప్రభుత్వ బోధనాసుపత్రులకు ఆరోగ్యశ్రీ చెల్లింపులు నిలిపివేసి ప్రజారోగ్య వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టారని హరీశ్ ఆరోపించారు. దాదాపు రూ.800 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్న నివేదికలను ఉటంకించారు.

ప్రభుత్వం ఆరోగ్యశ్రీని “బకాయి శ్రీ”గా మార్చిందని విమర్శించారు. పేద రోగులు కీలక వైద్యానికి దూరమవుతున్నారని అన్నారు.