నవీన్ యాదవ్ పుట్టినరోజు: నాణేలతో తులాభారం

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా వినూత్నంగా తులాభారం నిర్వహించారు. 23,300 రెండు రూపాయల నాణేలతో ఆయనను తూకం వేశారు. ఈ నాణేల మొత్తం విలువ రూ.46,600.

ఏజీ కాలనీ డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ అజారుద్దీన్ అలియాస్ షేక్ అజ్జు ఈ ప్రత్యేక వేడుకను ఏర్పాటు చేశారు. వేడుకల్లో భాగంగా సంప్రదాయ తులాభారంతో పాటు కేక్ కటింగ్ కూడా జరిగింది.

నవీన్ యాదవ్ పుట్టినరోజు కానుక ఆలయానికి

తులాభారం ద్వారా సేకరించిన రూ.46,600ను తర్వాత ఎమ్మెల్యే చేతుల మీదుగా యూసుఫ్‌గూడలోని పోచమ్మ ఆలయానికి విరాళంగా అందజేశారు. వేడుకను ఏర్పాటు చేసిన అజ్జుకు, ఆయన మద్దతుదారులకు నవీన్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.

యూత్ కాంగ్రెస్ నాయకులు సయ్యద్ నయీమ్, మహమ్మద్ ఖాలిద్, షేక్ అజ్జుతో పాటు పలువురు మద్దతుదారులు, శ్రేయోభిలాషులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.