శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లి గ్రామంలోని సందపల్లి చెరువులో 4 ఎకరాల వరకు విస్తరించిన ఆక్రమణలను హైడ్రా శనివారం తొలగించింది. చెరువు చుట్టూ గోడ కట్టి, పచ్చిక మైదానాలతో విశాలమైన ఎస్టేట్ను అభివృద్ధి చేయాలనుకున్న వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు సంస్థ తెలిపింది. చెరువు చుట్టూ నిర్మించిన గోడలను కూల్చివేసింది.
చెరువులో ఆక్రమణలు జరుగుతున్నాయన్న సమాచారం అందడంతో హైడ్రా రంగంలోకి దిగింది. సంబంధిత అధికారులతో కలిసి హైడ్రా అధికారులు స్థలాన్ని పరిశీలించారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోనే నిర్మాణాలు సాగుతున్నట్లు వారు నిర్ధారించారు. ఆ తర్వాత ఎఫ్టీఎల్ పరిధిలో 100 గజాల్లో నిర్మించిన ఇంటిని, దాని పక్కనే వేసిన షెడ్డును నేలమట్టం చేశారు.
సందపల్లి చెరువులో మళ్లీ ఆక్రమణలు జరగకుండా ఫెన్సింగ్
సందపల్లి చెరువు మొత్తం విస్తీర్ణం 76 ఎకరాలు. కొత్తగా ఆక్రమణలు జరగకుండా స్థానిక నీటిపారుదల శాఖ అధికారుల సమక్షంలో హైడ్రా అధికారులు చెరువు చుట్టూ 1,600 మీటర్ల మేర ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఆ భూమి చెరువుకు చెందినదని తెలిపే బోర్డులను కూడా పెట్టారు.
