కృష్ణకాంత్ పార్కు చెరువు 12 ఎకరాలకు విస్తరణ

హైదరాబాద్: కృష్ణకాంత్ పార్కు చెరువును 12 ఎకరాలకు విస్తరించి పునరుద్ధరించే ప్రణాళికపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదివారం ఉదయం పార్కులో వాకర్లతో చర్చించారు. ఈ చెరువు ఇప్పటికే 3 ఎకరాలకు కుంచించుకుపోయి మురుగు కుంటగా మారింది.

వరద నీరు నేరుగా చెరువులోకి చేరేలా హైడ్రా ఇన్‌లెట్లను అభివృద్ధి చేస్తోందని రంగనాథ్ తెలిపారు. భారీ వర్షాల సమయంలో జూబ్లీహిల్స్, వెంకటగిరి నుంచి పెద్ద ఎత్తున వచ్చే వరద నీటిని చెరువులోకి మళ్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు.

దీంతో కృష్ణానగర్, యూసుఫ్‌గూడ, మధురానగర్, శ్రీనివాస్ నగర్, అమీర్‌పేట, మైత్రీవనం ప్రాంతాలను వరద ముంచెత్తకుండా అడ్డుకట్ట పడుతుందని ఆయన పేర్కొన్నారు. వరద నీటిని నిల్వ చేసేలా కృష్ణకాంత్ పార్కు చెరువు లోతు పెంచే పనులు కూడా సాగుతున్నాయని చెప్పారు. చెరువు అభివృద్ధిపై వాకర్ల నుంచి ఆయన సూచనలు స్వీకరించారు.

కృష్ణకాంత్ పార్కు చెరువుతో పాటు పార్కునూ అభివృద్ధి చేయాలన్న స్థానికులు

పార్కులో తాము ఎదుర్కొంటున్న సమస్యలను స్థానికులు, సందర్శకులు కమిషనర్ దృష్టికి తెచ్చారు. దక్షిణం వైపు ఉన్న చెత్త డంపింగ్ యార్డుకు ప్రహరీ గోడ లేకపోవడంతో దుర్వాసన, చెత్త పార్కులోకి వస్తున్నాయని తెలిపారు. జిమ్ పరికరాలు దెబ్బతిన్నాయని, వాటికి మరమ్మతులు చేసి అదనపు పరికరాలు ఏర్పాటు చేయాలని కోరారు.

తమ్మిడికుంట వద్ద హైడ్రా ఇటీవల ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ అద్భుతంగా ఉందని వాకర్లు ప్రశంసించారు. చెరువు అభివృద్ధిలో భాగంగా ఇక్కడ కూడా అలాంటి సౌకర్యం కల్పించాలని విన్నవించారు. చెరువుతో పాటు పార్కునూ అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.

నగరవ్యాప్తంగా చెరువులను పునరుద్ధరిస్తున్న హైడ్రాను స్థానికులు అభినందించారు. పునరుద్ధరించిన చెరువులు చాలా బాగున్నాయని, చెరువుల వల్ల కలిగే ఎన్నో ప్రయోజనాలను అవి చాటుతున్నాయని అన్నారు. దాదాపు గంట పాటు సాగిన ఈ నడకలో ప్రకృతి పరిరక్షణపై వాకర్లు తమ సూచనలు అందించారు.