హైదరాబాద్: పారిశుద్ధ్య కార్మికులు, సఫాయి కర్మచారీల జీతాల పెంపునకు ప్రభుత్వానికి అధికారిక ప్రతిపాదనలు పంపాలని జాతీయ సఫాయి కర్మచారీల కమిషన్ సభ్యుడు కరమ్ సింగ్ కర్మ మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లను ఆదేశించారు. జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ ప్రతినిధులతో ఆయన సమావేశమై కార్మికుల సమస్యలు, సంక్షేమం, పని పరిస్థితులను సమీక్షించారు.
జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డితో పాటు సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కార్మిక సంఘాల నేతలు, పారిశుద్ధ్య కార్మికులు కూడా హాజరయ్యారు.
పారిశుద్ధ్య కార్మికులు, శాట్ డ్రైవర్లకు హెల్త్ కార్డులు, పీపీఈ కిట్లు, వైద్య బీమా కల్పించే అంశాలు చర్చకు వచ్చాయి. పీఎఫ్ చెల్లింపులు, కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనం వంటి అంశాలపైనా చర్చించారు. పదోన్నతులు, ఖాళీల భర్తీ, ఔట్సోర్సింగ్ నియామకాలు ప్రస్తావనకు వచ్చాయి. ఎంటమాలజీ కార్మికుల హాజరు, రీప్లేస్మెంట్, సర్వీసు సంబంధిత సమస్యలను సమావేశం పరిశీలించింది.
పారిశుద్ధ్య కార్మికులకు వైద్య బీమా కల్పించాలని సూచన
బీఓటీ పద్ధతిలోని పబ్లిక్ టాయిలెట్ల టెండర్లలో సఫాయి కర్మచారీలకు రిజర్వేషన్ కల్పించి, రుణాలు లేదా సబ్సిడీ అందించాలనే అంశంపైనా చర్చ జరిగింది. యాంత్రిక స్వీపింగ్, ఈవీ చార్జింగ్ స్టేషన్లలో ఉపాధి అవకాశాల గురించి కూడా మాట్లాడారు. కార్మికుల కాలనీల్లో కమ్యూనిటీ హాళ్లు, జిమ్‌లు, గ్రంథాలయాలు, ఆట పరికరాలు వంటి సౌకర్యాల ఏర్పాటును ప్రస్తావించారు.
కార్మికుల సమస్యలపై స్పందించిన కర్మ, వేతనాల పెంపుపై ప్రతిపాదనలు పంపాలని మూడు కార్పొరేషన్ల కమిషనర్లకు స్పష్టం చేశారు. కార్మికులకు వైద్య బీమా వర్తింపజేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన అన్ని సౌకర్యాలు, సంక్షేమ ప్రయోజనాలను జాప్యం లేకుండా అందించాలని కోరారు.
సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని కమిషనర్లు హామీ ఇచ్చారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రత, మెరుగైన పని పరిస్థితులకు ప్రాధాన్యం ఇస్తామని వారు పునరుద్ఘాటించారు.
