సైబరాబాద్: సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (సీటీపీ) వారాంతంలో నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 288 మంది పట్టుబడ్డారు. వీరిలో 241 మంది ద్విచక్ర వాహనదారులే ఉన్నారు. మిగతావారిలో నాలుగు చక్రాల వాహనదారులు 34 మంది, మూడు చక్రాల వాహనదారులు 12 మంది ఉన్నారు. ఒక భారీ వాహన డ్రైవర్ కూడా పట్టుబడ్డారు.
రక్తంలో ఆల్కహాల్ గాఢత (బీఏసీ) ఆధారంగా పోలీసులు పట్టుబడినవారిని వర్గీకరించారు. 231 మందిలో బీఏసీ 100 మి.లీ.కు 36 మి.గ్రా. నుంచి 200 మి.గ్రా. మధ్య నమోదైంది. మరో 37 మందిలో 201 నుంచి 300 మి.గ్రా., 20 మందిలో 301 నుంచి 550 మి.గ్రా. వరకు ఉంది. పట్టుబడినవారందరినీ కోర్టులో హాజరుపరుస్తామని ట్రాఫిక్ అడ్మిన్ ఏడీసీపీ జి. నరేందర్ తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 218 మందికి జరిమానా
నవంబర్ 16 నుంచి 21 వరకు కోర్టులు 218 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను పరిష్కరించాయి. ఈ కేసుల్లో అందరికీ కేవలం జరిమానా మాత్రమే విధించాయి. జరిమానాతో పాటు జైలు శిక్ష గానీ, సామాజిక సేవ గానీ ఎవరికీ పడలేదు.
మద్యం తాగి వాహనం నడపడం తీవ్రమైన నేరమని సైబరాబాద్ పోలీసులు మరోసారి స్పష్టం చేశారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రాణాంతక ప్రమాదానికి కారణమైతే భారతీయ న్యాయ సంహిత-2023లోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. హత్య కాని నేరపూరిత నరహత్యకు సంబంధించిన సెక్షన్ ఇది. ఈ నేరానికి గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా పడుతుంది.
