తిరుపతి: శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు డిసెంబర్ 6 నుంచి 14 వరకు తిరుచానూరులో జరగనున్నాయి. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలోనే తిరుచానూరు బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విస్తృత ఏర్పాట్లు చేస్తోందని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు.
అధికారులతో కలిసి ఆయన ఏర్పాట్లను సమీక్షించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
పంచమి తీర్థం రోజున లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా క్యూలైన్లు, కంపార్ట్మెంట్లు, జర్మన్ షెల్టర్లు ఏర్పాటు చేయనున్నారు. రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, భద్రతను మరింత పటిష్ఠం చేస్తారు.
తిరుచానూరు బ్రహ్మోత్సవాల వాహన సేవలు ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారం
ఆలయాన్ని, పరిసరాలను పుష్పాలతో, విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. వాహన సేవలను ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఈవో విజ్ఞప్తి చేశారు. జేఈవోలు డాక్టర్ ఎ. శరత్, ప్రభాల గోపీనాథ్, సీవీఎస్వో కె.వి. మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ సమీక్షలో పాల్గొన్నారు. ఇతర అధికారులు, ఆలయ అర్చకులు కూడా హాజరయ్యారు.
