హైదరాబాద్: టీజీఎస్ఆర్టీసీ ఐ-అలర్ట్ వ్యవస్థతో బీఎస్-6 బస్సుల్లో ఇప్పటివరకు సుమారు రూ.36 కోట్ల విలువైన హైస్పీడ్ డీజిల్ (హెచ్ఎస్డీ) ఆదా అయిందని సంస్థ వెల్లడించింది. ప్రతి నెలా సుమారు రూ.2 కోట్లు (కచ్చితంగా రూ.2,00,00,156.85) ఆదా అవుతుందని అంచనా వేసింది. బీఎస్-6 బస్సుల్లో ఈ వ్యవస్థను ప్రవేశపెట్టిన దేశంలోనే తొలి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తమదేనని టీజీఎస్ఆర్టీసీ పేర్కొంది.
ఇంధన సామర్థ్యం పెంచడం, సురక్షిత డ్రైవింగ్‌ను ప్రోత్సహించడం, డీజిల్ పొదుపు పద్ధతులను అలవాటు చేయడం లక్ష్యంగా సంస్థ ఈ సాంకేతికతను ప్రవేశపెట్టింది. దీనివల్ల నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గిందని, బస్సుల ఇంధన సామర్థ్యం మెరుగుపడిందని సంస్థ తెలిపింది.
ఐ-అలర్ట్ వ్యవస్థ డ్రైవర్ల డ్రైవింగ్ తీరును నిరంతరం పర్యవేక్షిస్తుంది. సరైన గేర్ ఎంపిక, నిర్దేశిత గ్రీన్ బ్యాండ్ ఆర్పీఎం పరిధిలో నడపడం, ఎకానమీ గేర్ల వినియోగాన్ని ఇది పరిశీలిస్తుంది. అనవసరంగా ఇంజిన్ ఐడ్లింగ్ కాకుండా చూస్తుంది. అతివేగం, బ్రేకులను అజాగ్రత్తగా వాడటం వంటి అంశాలనూ గమనిస్తుంది.
ప్రతి డ్యూటీ ముగిశాక డ్రైవర్ పనితీరుకు ఈ వ్యవస్థ గ్రేడ్ ఇస్తుంది. పనితీరు నివేదికల ఆధారంగా డ్రైవర్లకు క్రమం తప్పకుండా సూచనలు అందుతాయి. శాస్త్రీయ, ఇంధన పొదుపు డ్రైవింగ్ పద్ధతులు పాటించేలా మార్గదర్శకాలతో వారిని ప్రోత్సహిస్తున్నారు.
టీజీఎస్ఆర్టీసీ ఐ-అలర్ట్‌తో రోజూ 16.90 టన్నుల కర్బన ఉద్గారాల తగ్గింపు
సంస్థ 1,500 అశోక్ లేలాండ్ బీఎస్-6 బస్సుల్లో ఐ-అలర్ట్ పరికరాలను అమర్చింది. వీటితో రోజుకు 6,603 లీటర్లు, నెలకు 1,98,090 లీటర్ల హెచ్ఎస్డీ ఆదా అవుతోంది. ఒక లీటర్ డీజిల్‌తో సుమారు 2.56 కిలోల కర్బన ఉద్గారాలు వెలువడతాయని అంచనా వేశారు. ఈ లెక్కన రోజుకు 16,904 కిలోలు (సుమారు 16.90 మెట్రిక్ టన్నులు) కార్బన్ డయాక్సైడ్ తగ్గుతోంది.
30 రోజుల నెలకు ఇది 507.11 మెట్రిక్ టన్నులు కాగా, 365 రోజుల ఏడాదికి 6,169.84 మెట్రిక్ టన్నులకు చేరుతుంది. సాంకేతికత ఆధారిత డ్రైవింగ్‌తో ఖర్చుతో పాటు కాలుష్యమూ తగ్గుతుందని ఈ ప్రయోగం రుజువు చేసిందని సంస్థ పేర్కొంది.
ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర ప్రజా రవాణా పట్ల తమ నిబద్ధతకు ఇది నిదర్శనమని టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది రక్షణ లక్ష్యంగా కూడా ఈ సాంకేతికతను ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది. వనరుల పొదుపు కోసం ఇలాంటి సాంకేతిక చర్యలు కొనసాగిస్తామని చెప్పింది. ఏపీఎస్ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీ అధికారులు టీజీఎస్ఆర్టీసీ ఐ-అలర్ట్ పనితీరు వివరాలు ఇవ్వాలని ఉన్నతాధికారులను కోరారు.
ఐ-అలర్ట్ వంటి మంచి సాంకేతికతను అమలు చేసిన ఇంజినీరింగ్ విభాగాన్ని టీజీఎస్ఆర్టీసీ ఎండీ అనిల్ కుమార్ అభినందించారు. ఎప్పటికప్పుడు సాంకేతికతను మెరుగుపరుచుకుంటూ ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందించడమే సంస్థ లక్ష్యమని ఆయన చెప్పారు. ఇతర విభాగాలు కూడా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని సేవలను మరింత మెరుగుపరచాలని సూచించారు.
