హైదరాబాద్: టీజీఐఐసీ బాధితులకు న్యాయం జరిగే వరకు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) పోరాటం కొనసాగిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ తెలిపారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆదివారం జరిగిన బాధితుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
బాధితుల సమస్యను కోదండరాం సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో సానుకూల పరిణామాలు జరిగాయని నరసింహ అన్నారు. ఈ సమస్య టీజీఐఐసీ పరిధిలోకి రాదని అధికారిక లేఖలోనూ స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు.
సమస్య పరిష్కారానికి రాజకీయ పార్టీల పోరాటంతో పాటు బాధితుల ఐక్యత కూడా ఎంతో అవసరమని నరసింహ చెప్పారు. గత 22 ఏళ్లుగా తమకు జరిగిన అన్యాయంపై ఎంతవరకు పోరాడామో ప్లాట్ల యజమానులు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. బాధితులంతా ఏకమై ఆందోళన చేస్తేనే ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరుగుతుందని అన్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సుమారు 100 ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు, మిగులు భూములు, ఖాళీ చేసిన ఆస్తులను సీపీఐ గుర్తించిందని ఆయన గుర్తు చేశారు. 5 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇప్పించిన ఘనమైన చరిత్ర పార్టీకి ఉందని చెప్పారు. పేదలంతా ఐక్యంగా, సీపీఐ నాయకత్వంపై నమ్మకంతో పోరాడినందువల్లే ఆ విజయాలు సాధ్యమయ్యాయని తెలిపారు.
తన భూమిని ఆక్రమణల నుంచి కాపాడుకోవాలంటే ఎవరైనా కోర్టులు, పోలీస్ స్టేషన్లు, అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తుందని నరసింహ అన్నారు. ప్రభుత్వమే అధికారికంగా భూములు సేకరిస్తే వాటిని తిరిగి పొందడం అంత సులువు కాదని చెప్పారు. అందుకే బాధితులంతా ఏకమై హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
పీఓబీ ఆంక్షలతో టీజీఐఐసీ బాధితులకు ఇబ్బందులు: కోదండరాం
టీజీఐఐసీ బాధితుల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని కోదండరాం తెలిపారు. బాధితులకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో సంబంధిత మంత్రులకు సమస్యను వివరించామని చెప్పారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సానుకూల స్పందన కోసం ప్రయత్నిస్తున్నామని అన్నారు.
పరిస్థితులు బాధితులకు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ అధికారిక ప్రక్రియలో జాప్యం జరుగుతోందని కోదండరాం పేర్కొన్నారు. ప్లాట్ల యజమానులకు భూమిపై హక్కులు ఉన్నా, పీఓబీ ఆంక్షల వల్ల నిర్మాణాలు చేపట్టడం, ఎన్ఓసీలు పొందడం, అమ్మకాలు జరపడం సమస్యగా మారిందని వివరించారు.
ఈ సమస్యను పరిష్కరించి బాధితులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో జరుగుతున్న పోరాటాలకు బాధితులంతా మద్దతు ఇవ్వాలని సూచించారు. అందరూ కలిసి నడిస్తేనే సమస్యకు బలమైన పరిష్కారం లభిస్తుందని అన్నారు.
