కరీంనగర్: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సోమవారం కరీంనగర్ మహా పాదయాత్రలో పాల్గొననున్నారు. కరీంనగర్‌కు ఆయన రావడం ఇదే తొలిసారి. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
మధ్యాహ్నం 12.30 గంటలకు నబీన్ కరీంనగర్ కలెక్టరేట్ హెలిప్యాడ్‌లో దిగుతారు. అక్కడి నుంచి నేరుగా గాంధీ విగ్రహం వద్దకు చేరుకుంటారు. పాదయాత్ర అక్కడి నుంచే మొదలవుతుంది. వైశ్య భవన్లో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.
ప్రసంగం ముగిసిన వెంటనే ప్రజలతో కలిసి ఆయన పాదయాత్రలో నడుస్తారు. వైశ్య భవన్, రాజీవ్ చౌక్, టవర్ సర్కిల్, గడియారం సెంటర్, శాస్త్రి రోడ్, భారత్ టాకీస్, కమాన్ చౌరస్తా మీదుగా యాత్ర సాగుతుంది. సాయంత్రం 4.30 గంటలకు హెలిప్యాడ్‌కు తిరిగి వచ్చి హైదరాబాద్ వెళ్తారు. అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరుతారు.
సుమారు లక్ష మందితో మహా పాదయాత్ర నిర్వహించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్ని ఏర్పాట్లు చేశారు. రెండు రోజులుగా పార్టీ నేతలతో ఆయన వరుస సమావేశాలు నిర్వహించారు. జన సమీకరణ, పాదయాత్ర ఏర్పాట్లు, నగర అలంకరణ, ఫ్లెక్సీల ఏర్పాటుపై దిశానిర్దేశం చేశారు. పాదయాత్ర ప్రాంతాన్ని స్వయంగా సందర్శించి, లక్ష మందికి పైగా హాజరయ్యేలా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
కరీంనగర్ మహా పాదయాత్ర దారిలో మజ్జిగ, తాగునీటి కౌంటర్లు
కరీంనగర్‌ను తోరణాలు, జెండాలతో అలంకరించారు. రోడ్లకు ఇరువైపులా ఫ్లెక్సీలు, కటౌట్లు, హోర్డింగులు వెలిశాయి.
నబీన్‌కు వినూత్నంగా స్వాగతం పలికేందుకు బండి సంజయ్ ఏర్పాట్లు చేశారు. తెలంగాణ కళాకారులు నృత్య గీతాలు, డప్పు నృత్యాలతో ఆయనకు స్వాగతం పలుకుతారు. రచయిత ఆకుల నాగేశ్వరరావు నేతృత్వంలోని కళా బృందం పాదయాత్రలో ఆటపాటలతో అలరించనుంది.
పాదయాత్రకు వచ్చేవారికి ఇబ్బంది లేకుండా మార్గమంతా రవాణా, తాగునీటి సౌకర్యం కల్పించారు. లక్షకు పైగా మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేశారు. వివిధ సామాజిక సంస్థలు, సంఘాల ఆధ్వర్యంలో దారి పొడవునా ప్రత్యేక కౌంటర్లు పెట్టి నీరు, మజ్జిగ, ఆహార పదార్థాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
కరీంనగర్ మహా పాదయాత్ర చరిత్ర సృష్టిస్తుందని బండి సంజయ్ మీడియాతో అన్నారు. ‘ఎస్ఐఆర్’ పేరుతో రాజ్యాంగ సంస్థలపై దాడి చేస్తూ కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు దేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం – అరాచకాన్ని అంతం చేద్దాం’ నినాదంతో దేశవ్యాప్తంగా 40 చోట్ల మహా పాదయాత్రలు నిర్వహిస్తోందని తెలిపారు.
వీటిలో కరీంనగర్ యాత్రే ప్రత్యేక ఆకర్షణగా నిలిచి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. పాదయాత్ర విజయం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు వణుకు పుట్టిస్తుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
