హైదరాబాద్: 2047 నాటికి వికసిత భారత్ కల సాకారం కావాలంటే ఆరోగ్యకరమైన, డ్రగ్స్ రహిత యువత ఉండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం అన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని ఆయన పేర్కొన్నారు. 2029 డిసెంబర్ 31 నాటికి డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంగా దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయని తెలిపారు.
వివిధ భాషలు, సంప్రదాయాలకు హైదరాబాద్ నిలయమని కిషన్ రెడ్డి అన్నారు. కుటుంబాలను సురక్షితంగా ఉంచడం, నగర యువతకు బంగారు భవిష్యత్తు అందించడమే లక్ష్యంగా వివిధ వర్గాల ప్రజలు ఒక్కటి కావడం అభినందనీయమని చెప్పారు. డ్రగ్స్‌పై కొనసాగుతున్న యుద్ధంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజలను చైతన్యపరిచి యువత దారి తప్పకుండా చూసే బాధ్యత తీసుకోవాలని కోరారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రారంభమైన నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రభుత్వ కార్యక్రమంగానే కాకుండా ప్రజా ఉద్యమంగా మారిందని ఆయన అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో అక్రమ డ్రగ్స్ వ్యాపారంపై ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని కఠినంగా అమలు చేస్తోందని తెలిపారు. విద్య, ఐటీ, ఆవిష్కరణలకు కేంద్రమైన హైదరాబాద్‌లో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, ‘ఈగిల్ ఫోర్స్’ చేస్తున్న కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు.
చట్టాలు చేసి సరఫరాను అడ్డుకోవడం ప్రభుత్వం చేయగలదని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. యువతను వ్యసనం నుంచి కాపాడే బాధ్యత మాత్రం అందరిదని అన్నారు.
డ్రగ్స్ రహిత భారత్ కోసం పోరాటం ఇంటి నుంచే: కిషన్ రెడ్డి
ఒక పిల్లవాడు దారి తప్పితే కుటుంబమంతా చిన్నాభిన్నమవుతుందని, అందుకే ఈ పోరాటం ఇంటి నుంచే మొదలుకావాలని ఆయన సూచించారు. తల్లిదండ్రులు పిల్లలతో మనసు విప్పి మాట్లాడాలని, ఉపాధ్యాయులు వారికి సరైన మార్గనిర్దేశం చేయాలని చెప్పారు. డ్రగ్స్ వ్యాపారం చేసే నేరస్తులకు, వ్యసనానికి బలైనవారికి మధ్య తేడా చూడాలని అన్నారు. బాధితులకు కుటుంబ ప్రేమ, మద్దతుతో పాటు సరైన చికిత్స అందించాలని కోరారు.
డ్రగ్స్ వ్యసనం యువత ఆత్మవిశ్వాసాన్ని, సామర్థ్యాన్ని దెబ్బతీసి వారిని లక్ష్యాలకు దూరం చేస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండటం దేశం పట్ల యువత బాధ్యత అని చెప్పారు. ఇళ్లను, కాలనీలను, నగరాలను డ్రగ్స్ నుంచి విముక్తి చేయాలన్నది కేవలం ఒక కార్యక్రమం కాదని, ఒక ఉదాత్త సంకల్పమని పేర్కొన్నారు.
