హైదరాబాద్: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం (ఐకేజేబీపీ) కింద లబ్ధిదారుల నమోదుకు రాష్ట్ర ప్రణాళికా శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పథకంలో ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం లభిస్తుంది. ప్రతి కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే నమోదు అవకాశం ఉంటుంది.
బీమా పొందిన వ్యక్తి మరణిస్తే వారి నామినీలకు రూ.5 లక్షల పరిహారం అందుతుంది. ఒకరి కంటే ఎక్కువ నామినీలను నమోదు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. బలహీన వర్గాలకు ఆర్థిక భద్రత, సామాజిక రక్షణ ఇవ్వడమే పథకం ప్రధాన ఉద్దేశం.
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు శిబిరాలు
ప్రస్తుతం అమలులో ఉన్న ఇతర బీమా పథకాలను కొనసాగిస్తూనే, వాటన్నింటినీ ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హ కుటుంబాలు సులభంగా నమోదు చేసుకునేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించనుంది.
గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీ స్థాయిలో, పట్టణాల్లో గుర్తించిన వార్డుల్లో శిబిరాలు ఏర్పాటవుతాయి. వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. వేదికలు, తేదీలు, బాధ్యత వహించే అధికారుల వివరాలను ముందుగా ప్రజలకు తెలియజేస్తారు.
