హైదరాబాద్: తెలంగాణ జీవిత బీమా పథకం కార్యాచరణ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం (ఐకేజేబీపీ) కింద అర్హ కుటుంబాలకు రూ.5 లక్షల బీమా లభిస్తుంది. బీమా పొందిన సభ్యుడు మరణిస్తే నామినీలకు ఆ మొత్తం చెల్లిస్తారు.
ప్రతి కుటుంబం నుంచి ఒకరికే నమోదు అవకాశం ఉంటుంది. సాధారణంగా కుటుంబం ప్రకటించిన ప్రధాన సంపాదనాపరుడిని నామినేట్ చేయాలి. నమోదు సమయంలో వయసు 18–59 ఏళ్లు ఉండాలి. అంటే 1967 నవంబర్ 19 నుంచి 2008 నవంబర్ 18 మధ్య జన్మించినవారు అర్హులు.
తెలంగాణ జీవిత బీమా పథకం నమోదు విధానం
అర్హతను ఆధార్‌లోని పుట్టిన తేదీ ఆధారంగానే నిర్ణయిస్తారు. ఆధార్‌లో సంవత్సరం మాత్రమే ఉంటే జులై 1ను పుట్టిన తేదీగా పరిగణిస్తారు. తప్పుడు తేదీ ఉంటే ముందుగా ఆధార్ కేంద్రంలో సరిచేయించుకోవాలి.
గ్రామ పంచాయతీ స్థాయిలో, గుర్తించిన పట్టణ వార్డుల్లో సహాయక నమోదు శిబిరాలు నిర్వహిస్తారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సహాయం అందిస్తారు. ఆధార్, అందుబాటులో ఉంటే రేషన్ కార్డు, చరవాణి నంబరు తీసుకురావాలి. ప్రస్తుత బీమా పథకాలు కొనసాగుతూ ఐకేజేబీపీ పరిధిలోకి వస్తాయి.
