హైదరాబాద్: రైస్ మిల్లర్ల బకాయిలను తక్షణం వసూలు చేయాలని, సీఎంఆర్ అక్రమాలపై జవాబుదారీతనం ఉండాలని బీజేపీ సీనియర్ నేత గూడూరు నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. వందల క్రిమినల్ కేసులు నమోదు చేసినా ఆర్థిక జవాబుదారీతనం నెలకొల్పడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని శనివారం ఒక ప్రకటనలో ఆరోపించారు.
పౌరసరఫరాల సంస్థ మిల్లర్లపై 540 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిందని ఆయన గుర్తుచేశారు. 2024-25 బడ్జెట్ ప్రకారం సుమారు 1,000 మిల్లర్లు 2010-11 నుంచి 2022-23 మధ్య రూ.3,000 కోట్ల బకాయిలు పెట్టారు. అందులో రూ.450 కోట్లు వసూలయ్యాయని ప్రభుత్వం చెప్పింది.
రైస్ మిల్లర్ల బకాయిలపై ఆడిట్ ఏది?
మరో రూ.509 కోట్లకు 60 మంది మిల్లర్లపై రెవెన్యూ రికవరీ చట్టం కింద చర్యలు ప్రారంభించారు. వసూలైన మొత్తం, మిగిలిన బకాయిలపై తాజా లెక్కలు చెప్పాలని ఆయన కోరారు. ఆగస్టు 2026లో ప్రకటించిన సమగ్ర ఆడిట్ ఫలితాలు మూడు నెలలైనా వెల్లడికాలేదన్నారు.
జిల్లాల వారీగా, మిల్లుల వారీగా వివరాలను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిజాయితీగల మిల్లర్లను వేధించకూడదని అన్నారు.
