తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు: త్వరలో ఆన్‌లైన్ పోర్టల్

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కమిటీ నిర్ణయించింది. ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను త్వరగా ప్రారంభించాలని తీర్మానించింది. కె. కేశవరావు అధ్యక్షతన కమిటీ శనివారం పొన్నం ప్రభాకర్ మంత్రుల క్వార్టర్స్‌లోని నివాసంలో సమావేశమైంది.

సమావేశంలో కేశవరావుతో పాటు పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోటే శోభన్ రెడ్డి, శ్యామ్ మోహన్ పాల్గొన్నారు. యూనివర్సిటీ ఉద్యమకారులు, కళాకారులు, వివిధ వర్గాలతో జరిగిన సంప్రదింపుల పురోగతిని సభ్యులు సమీక్షించారు.

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు పోర్టల్‌పై దృష్టి

ఉద్యమకారుల నమోదుకు ప్రతిపాదించిన వెబ్‌సైట్ స్థితి, కాలపరిమితిపై చర్చ సాగింది. పోర్టల్ ఆలస్యం లేకుండా ప్రజలకు చేరాలని సభ్యులు స్పష్టం చేశారు.

పోర్టల్ సాంకేతిక పురోగతిని సమీక్షించేందుకు కమిటీ త్వరలో మళ్లీ సమావేశమవుతుంది. ఆ భేటీ తర్వాత ప్రారంభోత్సవం, తదుపరి కార్యాచరణపై అధికారికంగా ప్రకటిస్తారు.