హైదరాబాద్: మాదకద్రవ్యాలపై అవగాహన కోసం నవంబర్ 25 నుంచి 27 వరకు ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ పాదయాత్ర జరుగుతుందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రకటించారు. నగర ప్రజలందరూ, ముఖ్యంగా యువత ఇందులో ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన కోరారు.
నగరంలోని పలు ప్రాంతాలు, ప్రధాన ప్రదేశాల మీదుగా ఈ యాత్ర సాగుతుందని మంత్రి తెలిపారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా చైతన్యం పెంచడం, సమష్టి సంకల్పాన్ని బలోపేతం చేయడం దీని ఉద్దేశమని చెప్పారు. డ్రగ్స్ లేని సమాజమే లక్ష్యమని, దాని నిర్మాణంలో అందరూ కలిసి రావాలని ఆయన అన్నారు.
అంబర్‌పేట నుంచి మొదలయ్యే నషా ముక్త్ భారత్ యాత్ర
ప్రతి రోజు ఉదయం 9 గంటలకు యాత్ర మొదలవుతుంది. తొలి రోజు అంబర్‌పేట ఎంసీహెచ్ గ్రౌండ్ నుంచి బయలుదేరి ప్రభుత్వ ఫీవర్ ఆసుపత్రి మీదుగా సాగుతుంది. ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీ వద్ద ప్రతిజ్ఞ ఉంటుంది. అనంతరం యాత్ర ఇఫ్లూ కాలేజీకి చేరుకుంటుంది.
మోడల్ హైస్కూల్లో భోజన విరామం తర్వాత గాంధీ ఆసుపత్రి వైపు యాత్ర వెళ్తుంది. ముషీరాబాద్‌లోని కశిష్ ఫంక్షన్ హాల్లో తొలి రోజు రాత్రి బస ఉంటుంది.
నవంబర్ 26న కశిష్ ఫంక్షన్ హాల్ నుంచి రెండో రోజు యాత్ర మొదలై ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హిమాయత్‌నగర్ కూడలి మీదుగా సాగుతుంది. అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ తర్వాత మున్సిపల్ గ్రౌండ్స్‌లో భోజన విరామం ఉంటుంది. అలాగే బడా గణేష్, ఖైరతాబాద్ కూడలి వద్ద కూడా ప్రతిజ్ఞ చేస్తారు. సత్యం థియేటర్ సమీపంలో రెండో రాత్రి బస ఉంటుంది.
చివరి రోజైన నవంబర్ 27న సత్యం థియేటర్ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. యూసుఫ్‌గూడ చెక్ పోస్ట్, ఇందిరా నగర్ కూడలి వద్ద ప్రతిజ్ఞలు ఉంటాయి. జగన్నాథ స్వామి ఆలయం వెనుక భోజన విరామం తర్వాత జూబ్లీహిల్స్‌లో పాదయాత్ర ముగుస్తుంది.
ప్రతి అడుగు, ప్రతి గొంతు ముఖ్యమేనని కిషన్ రెడ్డి అన్నారు. యువతను మత్తుపదార్థాలకు దూరంగా ఉంచేందుకు, కుటుంబాలను సురక్షితంగా ఉంచేందుకు, ఆరోగ్యకరమైన, మత్తు లేని సమాజాన్ని నిర్మించేందుకు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మత్తు జీవితాన్ని ఆక్రమించకుండా చూసుకోవాలని, నషా ముక్త్ భారత్ కోసం కలిసి ముందడుగు వేయాలని కోరారు. ‘ఒకే మిషన్, ఒకే సంకల్పం, మత్తు రహిత భారత్’ అనే నినాదంతో ఆయన తన పోస్టును ముగించారు.
