లొంగిపోయిన మావోయిస్టులకు రూ.5.6 కోట్లు

హైదరాబాద్: లొంగిపోయిన 214 మంది మావోయిస్టులకు సోమవారం రూ.5.6 కోట్ల విలువైన చెక్కులు అందాయి. దీంతో మంజూరైన రూ.22.3 కోట్లలో ఇప్పటివరకు రూ.17.68 కోట్లు పంపిణీ అయ్యాయి. ఈ మొత్తంలో రివార్డులు, ఆర్థిక సాయం ఉన్నాయని డీజీపీ సి.వి. ఆనంద్ తెలిపారు.

మాజీ కేడర్లు ప్రధాన స్రవంతిలో జీవితాన్ని తిరిగి నిర్మించుకునేందుకు ఇది కొత్త ప్రారంభమని డీజీపీ పేర్కొన్నారు. గత 3 ఏళ్లలో తెలంగాణలో 824 మంది మావోయిస్టు కేడర్లు లొంగిపోయారని చెప్పారు. వీరిలో 59 మంది రాష్ట్రానికి చెందినవారు కాగా, ఎక్కువ మంది ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చారు. మిగతావారు ఏపీ, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందినవారని వివరించారు.

తెలంగాణ పునరావాస విధానంపై ఉన్న నమ్మకం, విశ్వాసానికి ఇది నిదర్శనమని ఆనంద్ అన్నారు.

లొంగిపోయిన మావోయిస్టు లకు నిమ్స్‌లో వైద్య సాయం

కర్రెగుట్టలు, వరంగల్‌లో లొంగిపోయిన కేడర్లను కలిసినప్పుడు వారి సమస్యలను విన్నానని డీజీపీ చెప్పారు. ప్రభుత్వం నిమ్స్‌లో వైద్య సాయం అందిస్తోందని, ఆరోగ్య రక్షణ కార్డులు జారీ చేసిందని తెలిపారు. తెలంగాణకు చెందినవారికి గృహ సాయంతో పాటు వృత్తి శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం, పోలీసు అధికారులు వారితో క్రమం తప్పకుండా మాట్లాడతారని చెప్పారు.

మరోవైపు గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్, ఛత్తీస్‌గఢ్ డీఆర్‌జీ బలగాలు సంయుక్త ఆపరేషన్లలో 252 తుపాకులు, 359 బీజీఎల్ షెల్స్ స్వాధీనం చేసుకున్నాయి. కర్రెగుట్టల్లోని 9 డంప్‌లలో బలగాలు వీటిని గుర్తించాయని, డీమైనింగ్ కొనసాగుతుందని డీజీపీ తెలిపారు.

ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రభావిత ప్రాంతాల్లో జీవనోపాధి, అభివృద్ధిపైనే దృష్టి ఉందని ఆనంద్ అన్నారు. దీనివల్ల లొంగిపోయిన మావోయిస్టు లు గౌరవంగా జీవితాన్ని పునర్నిర్మించుకోగలుగుతారని చెప్పారు.