హైదరాబాద్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం అన్నోజిగూడలోని మీరాలం చెరువును హైడ్రా సోమవారం ఆక్రమణల నుంచి కాపాడింది. హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు అందిన వారంలోనే చర్యలు చేపట్టింది. ప్లాట్ల హద్దులు, ప్రహరీ గోడలను తొలగించి ఫెన్సింగ్ వేసింది. దీంతో 4.12 ఎకరాల జలవనరు సురక్షితంగా మారిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
మీరాలం కుంట మొత్తం 4.12 ఎకరాల్లో విస్తరించి ఉంది. అయితే ఒక వైపు ఆక్రమణదారులు ప్లాట్లు వేసి ప్రహరీ గోడలు కట్టారు. తాము ఎంత ప్రయత్నించినా, సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేసినా ఆక్రమణలు ఆగలేదని స్థానికులు తెలిపారు.
ఫిర్యాదు చేసిన వారంలోనే మీరాలం చెరువు కు రక్షణ
ఫిర్యాదు అందిన వారంలోనే హైడ్రా స్థలాన్ని పరిశీలించి వెంటనే స్పందించిందని స్థానికులు చెప్పారు. మున్సిపల్ ప్రతినిధులుగా ఉన్నప్పుడు చెరువును కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదన్నారు. హైడ్రాకు ఫిర్యాదు చేశాక మాత్రం ఫలితం కనిపించిందని తెలిపారు. చెరువుల పరిరక్షణలో హైడ్రా పనితీరు చూసి ఫిర్యాదు చేశామని, తమ నమ్మకం వృథా కాలేదని పేర్కొన్నారు.
చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమణదారులు వరుసగా ప్లాట్లు వేశారు. చెరువు లోపలికి మరింత చొచ్చుకెళ్లి ప్రహరీ గోడలు కూడా కట్టారు. అంతేకాదు, చెరువు భూమిని తమదిగా చెప్పుకుంటూ అక్కడ లేఅవుట్ వేసేందుకు ప్రయత్నించారు.
క్షేత్రస్థాయిలో పర్యటించిన హైడ్రా అధికారులు సర్వే ఆఫ్ ఇండియా రికార్డులు, శాటిలైట్ చిత్రాలు, గ్రామ రికార్డులను పరిశీలించారు. ఆ తర్వాత మీరాలం చెరువు పరిరక్షణకు చర్యలు చేపట్టారు. సోమవారం చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేసి, 4.12 ఎకరాలను జలవనరుగా కాపాడారు.
