కరీంనగర్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ నితిన్ నబీన్ సోమవారం కరీంనగర్లో బహిరంగ సభలో ప్రసంగించి, ‘లోక్తంత్ర బచావో, అరాజకత హఠావో’ పాదయాత్రలో పాల్గొంటారు. నితిన్ నబీన్ పర్యటన షెడ్యూల్ ప్రకారం ఆయన ఉదయం 11 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు హెలికాప్టర్లో కరీంనగర్‌కు బయలుదేరుతారు.
వైశ్య భవన్లో బహిరంగ సభ జరుగుతుంది. సభ ముగిశాక పాదయాత్ర మొదలవుతుంది. టవర్ సర్కిల్, శాస్త్రి రోడ్ మీదుగా సాగే ఈ యాత్ర కామన్ సర్కిల్ వద్ద ముగుస్తుంది.
మధ్యాహ్నం 3 గంటలకు నబీన్ హైదరాబాద్ తిరుగుపయనమవుతారు. అక్కడి నుంచి ఆయన ఢిల్లీ వెళతారు.
నితిన్ నబీన్ పర్యటనకు ముందు కాంగ్రెస్‌పై ఆరోపణలు
పర్యటనకు ముందు నబీన్ ఎక్స్‌లో తెలుగు, ఇంగ్లీష్‌లో పోస్ట్ పెట్టారు. ‘తెలంగాణ ప్రజలు మార్పు కోసం ఓటేశారు. కానీ వారికి దక్కింది దోపిడీ, బూటకపు హామీలు, అరాచకం మాత్రమే!’ అని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీలోని తమ నాయకత్వం కోసం కాంగ్రెస్ తెలంగాణను ఏటీఎంలా వాడుకుంటోందని నబీన్ ఆరోపించారు. పాలనపై దృష్టి పెట్టకుండా రాష్ట్రాన్ని అరాచకం దిశగా తీసుకెళ్తోందని విమర్శించారు.
భారత వ్యతిరేక శక్తులను ఒకచోట చేర్చేందుకు కాంగ్రెస్ తెలంగాణ నేలను ఉపయోగించుకుంటోందని, దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని ఆయన అన్నారు. ఈ విభజన ఎజెండాను ప్రజలు గుర్తించారని, వారు తగిన జవాబు ఇస్తారని చెప్పారు.
కరీంనగర్లో రాష్ట్ర ప్రజలతో కలిసి ఈ అభియాన్‌లో పాల్గొనేందుకు ఎదురుచూస్తున్నానని కూడా నబీన్ తన పోస్ట్‌లో రాశారు.
