హైడ్రా ప్రజావాణికి 51 ఆక్రమణ ఫిర్యాదులు

హైదరాబాద్: పార్కులు, ప్రజావసర స్థలాలు, చెరువులు, నాలాలను కాపాడాలని కోరుతూ సోమవారం హైడ్రా ప్రజావాణి కి 51 ఫిర్యాదులు వచ్చాయి. హైడ్రా అదనపు కమిషనర్ డి. ఆనంద్ కుమార్ ఫిర్యాదులను పరిశీలించారు. పరిష్కారం కోసం వాటిని సంబంధిత అధికారులకు అప్పగించారు.

ఇప్పటికే కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న నగరంలో పార్కులు, ఖాళీ ప్రజావసర స్థలాలను ఆక్రమణదారులు మింగేస్తున్నారని పలువురు ఫిర్యాదుదారులు వాపోయారు. ఆక్సిజన్ అందించే పార్కులను కబ్జా చేయడంతో నివాసితులకు ఊపిరి పీల్చుకునే చోటు లేకుండా పోతోందని అన్నారు. బడులు, కమ్యూనిటీ హాళ్లు, ఇతర ప్రజా అవసరాలకు కేటాయించిన స్థలాలు సైతం ఆక్రమణకు గురవుతున్నాయని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్లకు గిఫ్ట్ డీడ్ ఇచ్చినా ఫలితం ఉండటం లేదని పేర్కొన్నారు.

పార్కుల అభివృద్ధికి నిధులు లేని చోట ఒక సులువైన మార్గం ఉందని ఫిర్యాదుదారులు సూచించారు. ఆ స్థలాల చుట్టూ ప్రహరీ గోడలు కట్టి, పార్కు స్థలమని బోర్డులు పెడితే సరిపోతుందన్నారు. అప్పుడు ప్రజలే వాటిని కాపాడి, మొక్కలు నాటి పర్యావరణానికి మేలు చేస్తారని చెప్పారు. లేఅవుట్లలో పార్కులు, ప్రజావసర స్థలాలకు బోర్డులు, హద్దులు స్పష్టంగా లేకపోవడం వల్లే ఆక్రమణలు జరుగుతున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు.

హైడ్రా ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుల్లో రంగారెడ్డి జిల్లా ఉప్పల్ మండలం కొత్తపేటలోని మారుతీ నగర్ వాసులు 667 చదరపు గజాల స్థలాన్ని కాపాడాలని కోరారు. సుమారు 600 ఇళ్లున్న ఈ కాలనీలో ఆ స్థలం ప్రజా అవసరాలకు ఉద్దేశించినది. ఆక్రమణదారులు అక్కడ గది నిర్మించేందుకు పలుమార్లు ప్రయత్నించగా మారుతీ నగర్ డెవలప్‌మెంట్ సొసైటీ అడ్డుకుంది. స్థలాన్ని కాపాడి, ప్రజావసర స్థలంగా బోర్డులు ఏర్పాటు చేయాలని వారు హైడ్రాను కోరారు.

పార్కులు, ప్రజావసర స్థలాల ఆక్రమణలపై హైడ్రా ప్రజావాణికి 51 ఫిర్యాదులు

హైడ్రా ప్రజావాణిలో చెరువులు, ఆట స్థలాల కబ్జాలపై ఫిర్యాదులు

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం వాసులు కొమిటి కుంట చెరువుపై ఫిర్యాదు చేశారు. కొందరు చెరువులో మట్టి పోసి ఆక్రమిస్తున్నారని తెలిపారు. ఆక్రమణల కారణంగా చెరువు వెంట ఉన్న 50 అడుగుల రోడ్డు 30 అడుగులకు కుంచించుకుపోయి ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ఆక్రమణలు తొలగించి, చెరువు ఎఫ్‌టీఎల్ హద్దుల వెంట ఫెన్సింగ్ వేయాలని కోరారు.

మియాపూర్‌లోని ప్రశాంత్ నగర్ కాలనీలో పార్కులు, ఖాళీ ప్రజావసర స్థలాలను హైడ్రా గతంలోనే కాపాడింది. అయితే మరో ఖాళీ స్థలంలో ఒక నిర్మాణం ఇంకా అలాగే ఉంది. కొందరు సంక్షేమ సంఘం మాజీ సభ్యులు దాన్ని కార్యాలయంగా వాడుకుంటూ స్థలాన్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశాంత్ నగర్ రెగ్యులరైజేషన్ కోఆర్డినేషన్ కమిటీ ఆరోపించింది. ఫెన్సింగ్ వేసి, ఆ నిర్మాణాన్ని తొలగించాలని కమిటీ కోరింది.

తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధి సర్వే నంబర్ 338లో రోడ్లు, పార్కు స్థలంలో కొందరు ప్రహరీ గోడలు కడుతున్నారని ఫిర్యాదుదారులు తెలిపారు. మున్సిపల్ అధికారులు గతంలో ఆ గోడలు తొలగించినా, అదే ప్రాంతంలో మళ్లీ నిర్మాణాలు మొదలయ్యాయని చెప్పారు. సర్వే చేసి ఆక్రమణలు తొలగించాలని వారు కోరారు.

రాజేంద్రనగర్ మండలం మైలార్‌దేవ్‌పల్లిలోని శాస్త్రిపురం హౌసింగ్ కాలనీ వాసులు 6,500 చదరపు గజాల ఆట స్థలంపై ఆందోళన వ్యక్తం చేశారు. హైడ్రా గతంలో దాన్ని కాపాడినా, మళ్లీ ఆక్రమణకు గురయ్యే ప్రమాదం ఉందని అన్నారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కొందరు జేసీబీతో స్థలాన్ని చదును చేసి బోరు వేసేందుకు ప్రయత్నించారని తెలిపారు.

శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేట్‌లోని కొత్త కుంట చెరువుపై ఆక్రమణదారులు భారీ వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. సర్వే నంబర్ 99 చూపించి, చెరువు ఉన్న సర్వే నంబర్ 100ను ఆక్రమిస్తున్నారని వారు తెలిపారు. ఓ కార్ గ్యారేజ్ కూడా పరిసరాలను పాడుచేస్తోందని చెప్పారు. చెరువును కాపాడేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని హైడ్రాను కోరారు.