పల్నాడు వాటర్ గ్రిడ్

హైదరాబాద్: పల్నాడు వాటర్ గ్రిడ్ పేరిట నాగార్జునసాగర్ వద్ద ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పనులను వెంటనే ఆపించాలని బీఆర్ఎస్ నేతలు కృష్ణా నది యాజమాన్య బోర్డును (కేఆర్ఎంబీ) కోరారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సారథ్యంలోని బీఆర్ఎస్ బృందం సోమవారం జలసౌధలో బోర్డు చైర్మన్‌ను కలిసింది. ఈ ప్రాజెక్టు తెలంగాణ నీటి హక్కులను దెబ్బతీస్తుందని, కృష్ణా జలాల వాడకంపై ప్రభావం చూపుతుందని నేతలు ఆరోపించారు.

సాగర్ జలాలను పల్నాడు ప్రాంతానికి తరలించేందుకు ఏపీ సర్కారు ఈ పనులు చేపట్టింది. అయితే వీటికి తగిన అనుమతులు గానీ, నీటి కేటాయింపులు గానీ లేవని బీఆర్ఎస్ తన ఫిర్యాదులో తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 నిబంధనలను ఈ పనులు ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించింది.

కృష్ణా నీటిపై రాష్ట్ర హక్కులను కాపాడే బాధ్యత కేఆర్ఎంబీదేనని నేతలు గుర్తుచేశారు. పల్నాడు వాటర్ గ్రిడ్ డీపీఆర్‌తో పాటు అనుమతులు, నీటి కేటాయింపులు, ఇతర సాంకేతిక వివరాలన్నీ బయటపెట్టాలని కోరారు. అనుమతి లేని నిర్మాణాల వల్ల రాబోయే రోజుల్లో కృష్ణా నీటి వినియోగంలో తెలంగాణ నష్టపోయే ముప్పు ఉందని ఆందోళన చెందారు.

పల్నాడు వాటర్ గ్రిడ్‌పై పారదర్శకత కోరిన బీఆర్ఎస్

ప్రాజెక్టు సమాచారం మొత్తాన్ని తెలంగాణకు అందజేయాలని, నిర్మాణాలను తక్షణం ఆపాలని నేతలు డిమాండ్ చేశారు. కృష్ణా నీటి వాడకం, కేటాయింపులు, ప్రాజెక్టుల నిర్మాణంలో పారదర్శకత పాటించాలని సూచించారు. కేటాయింపుల ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నీరు తగ్గకుండా చర్యలు చేపట్టాలని చైర్మన్‌ను కోరారు.

సాగర్ పరిధిలో జరుగుతున్న పనులను బోర్డు వెంటనే పరిశీలించాలని బీఆర్ఎస్ నేతలు అన్నారు. నిబంధనల ఉల్లంఘన బయటపడితే ఆ పనులను నిలిపివేయాలని కోరారు. కృష్ణా బోర్డుతో ప్రభుత్వం సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర నీటి ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు.

ఏపీ చేపట్టిన అక్రమ ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు పట్టనట్టు వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. సాగర్ నీటిని దోచుకునేందుకు ఏపీ కుట్రలు పన్నుతోందని ఆమె ఆరోపించారు. ఆ కుట్రలను అడ్డుకోవాలంటూ కేఆర్ఎంబీ అధికారులకు విన్నవించామని తెలిపారు.

హైదరాబాద్‌లో ఇప్పటికే నిత్యం 10 వేల ట్యాంకర్లు నడుస్తున్నాయని ఆమె గుర్తుచేశారు. ఈ నిర్మాణం పూర్తయితే నీటి ఎద్దడి ఇంకా పెరుగుతుందని ఆందోళన వెలిబుచ్చారు. కాంగ్రెస్ సర్కారు ఇప్పటికైనా మేల్కొని ఏపీ కుట్రలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు.

సాగర్ నుంచి నీటిని అక్రమంగా మళ్లించేందుకు ఏపీ నిర్మాణాలు మొదలుపెట్టిందని ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, తెలంగాణ.. ఎవరికీ చెప్పకుండానే ఆ పనులకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ పనులు ఆపించాలని కోరుతూ బోర్డు అధికారులకు లేఖ అందజేశామని తెలిపారు.

సాగర్ నుంచి ఏపీ ఇప్పటికే తన వాటాకు మించి నీటిని వాడుకుందని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ నీటిని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏపీకి అప్పగించిందని విమర్శించారు. తాగు, సాగునీటి కోసం 2.5 కోట్ల మంది అవస్థలు పడాల్సిన పరిస్థితి హైదరాబాద్, మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో తలెత్తిందని ఆయన అన్నారు.