కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం హెచ్చరిక: హద్దు దాటితే ఉపేక్షించం

అచ్చంపేట: ఎవరు లక్ష్మణరేఖ దాటినా ఉపేక్షించబోమని రాష్ట్ర కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం చైర్మన్, ఎంపీ డాక్టర్ మల్లు రవి హెచ్చరించారు. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రభుత్వ పనితీరును బహిరంగంగా తప్పుపట్టిన వ్యవహారంపై ఆయన ఇలా స్పందించారు.

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఇటీవల ప్రభుత్వాన్ని బాహాటంగా విమర్శిస్తున్నారు. సీనియర్ నేతలు ఈ అంశాన్ని తనకు తెలియజేశారని మల్లు రవి చెప్పారు.

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ కూడా ఆయనతో ఉన్నారు.

పీసీసీ అధ్యక్షుడితో కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చర్చలు

ఈ అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో మాట్లాడానని మల్లు రవి తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఏఐసీసీ ఇన్‌చార్జి సందీప్‌కు కూడా సమాచారం అందించానని చెప్పారు.

దీనిపై చర్చించేందుకు పొలిటికల్ అఫైర్స్ కమిటీ ప్రత్యేకంగా భేటీ కానుందని ఆయన వెల్లడించారు. పార్టీ క్రమశిక్షణకు, నిర్ణయాలకు విరుద్ధంగా ఎవరూ బహిరంగంగా మాట్లాడకుండా ముందుముందు పార్టీ గట్టి నిర్ణయాలు తీసుకోవచ్చని మల్లు రవి పేర్కొన్నారు.