హైదరాబాద్: రాష్ట్రంలో వేగంగా ఎదిగే సత్తా ఉన్న 50 స్టార్టప్‌లతో ‘టై50 తెలంగాణ 2026’ జాబితాను టై హైదరాబాద్ ప్రకటించింది. హైదరాబాద్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (హెచ్‌ఈఎస్ 2026)లో ఈ జాబితాతో పాటు సంస్థ వార్షిక నివేదికను కూడా విడుదల చేసింది.
ఎంపికైన కంపెనీలు టెక్నాలజీ, కృత్రిమ మేధ, ఆరోగ్య సంరక్షణ, బయోటెక్నాలజీ, ఫిన్‌టెక్, రోబోటిక్స్, క్లీన్ ఎనర్జీ, ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ రంగాలకు చెందినవి. తెలంగాణ వ్యవస్థాపక రంగంలో పెరుగుతున్న వైవిధ్యానికి, ఆవిష్కరణల సామర్థ్యానికి ఇది నిదర్శనమని టై హైదరాబాద్ పేర్కొంది.
టై హైదరాబాద్ నేతృత్వంలో నడుస్తున్న ఈ కార్యక్రమానికి క్వాల్కమ్ ప్రోగ్రామ్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఆశాజనక స్టార్టప్‌లను గుర్తించి, మార్గదర్శనం, పరిశ్రమ పరిచయాలు, వృద్ధి అవకాశాలతో వాటిని బలోపేతం చేయడమే దీని లక్ష్యం.
స్టార్టప్‌లను గుర్తించడం మాత్రమే కాకుండా, అవి ఎదిగేందుకు అవకాశాలు కల్పించడమే టై50 ఉద్దేశమని టై హైదరాబాద్ అధ్యక్షుడు మురళి కాకర్ల అన్నారు. వర్ధమాన వ్యవస్థాపకులను పెట్టుబడిదారులు, కస్టమర్లు, పరిశ్రమ పెద్దలు, విస్తృత వ్యాపార వర్గాలతో అనుసంధానించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. గుర్తింపు నిజమైన అవకాశాలుగా మారితే స్టార్టప్‌లు స్థిరంగా ఎదిగి ఉద్యోగాలు కల్పిస్తాయని, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
టై50 తెలంగాణ స్టార్టప్‌లకు 12 నెలల మార్గదర్శనం
ఎంపికైన వ్యవస్థాపకులకు 12 నెలల పాటు నిరంతర సహకారం, ప్రత్యేక మార్గదర్శనం లభిస్తాయి. పెట్టుబడిదారులు, పరిశ్రమ ప్రముఖులను కలిసే వీలుతో పాటు రూ.5 లక్షలకు పైగా విలువైన భాగస్వామ్యాలు అందుతాయి. అలాగే 67కు పైగా చాప్టర్లు, 15,000కు పైగా సభ్యులున్న టై అంతర్జాతీయ నెట్‌వర్క్‌తో అనుసంధానమయ్యే అవకాశం ఉంటుంది.
ఎంపిక ప్రక్రియలో క్వాల్కమ్, కేపీఎంజీ, టెంపస్ లా అసోసియేట్స్, చరంత్ర, రాక్వెల్ బిజినెస్ స్కూల్ భాగస్వాములయ్యాయి. మూల్యాంకన విధానానికి ఈ సంస్థలు స్వతంత్ర నైపుణ్యాన్ని జోడించాయని టై హైదరాబాద్ తెలిపింది. వీటి సహకారంతో ఎంపికలో, టాప్ 50 నివేదిక తయారీలో న్యాయబద్ధత, పారదర్శకత, నిష్పాక్షికత, కచ్చితత్వం సాధ్యమయ్యాయని పేర్కొంది.
టై50 కార్యక్రమం 2025లో మొదలైంది. ఆశాజనక సంస్థలను గుర్తించే వేదికగా ప్రారంభమై, ఇప్పుడు వ్యవస్థాపకులకు అన్నివిధాలా అండగా నిలిచే విస్తృత కార్యక్రమంగా మారింది. తొలి ఏడాది 400కు పైగా దరఖాస్తులు రాగా, 2026లో 465 వచ్చాయి.
134 మంది వ్యవస్థాపకుల నుంచి 50 సంస్థల ఎంపిక
ఈ ఏడాది 134 మంది వ్యవస్థాపకులు జ్యూరీ ముందు తమ సంస్థలను ప్రదర్శించారని టై హైదరాబాద్ టై50 కమిటీ చైర్ గౌరవ్ మాథుర్ తెలిపారు. పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, పరిశ్రమ నిపుణులు ఈ జ్యూరీలో ఉన్నారు. కఠిన మూల్యాంకనం తర్వాత 50 సంస్థలు ఎంపికయ్యాయని మాథుర్ చెప్పారు. కల్పించిన అవకాశాలు, ఏర్పరిచిన పరిచయాలు, బలపడిన వ్యవస్థాపక ప్రయాణాలతోనే టై50 విజయాన్ని కొలవాలని ఆయన అన్నారు.
అడిఓఎస్ ప్లాట్‌ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్, ఏడీటీకోర్ ఎక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏఐ ప్లానెట్, ఏపెక్స్ క్యూరా హెల్త్‌కేర్ ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆస్ట్రాఫేజ్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అట్లాస్ట్ మోటోజెన్ ప్రైవేట్ లిమిటెడ్, ఆవర్తన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, బెఫాక్ ఇంటర్నేషనల్, కాగ్నిరా ఏఐ, కాలజీ బయోసైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, కాన్సిటెల్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్, దక్కన్ ఏఐ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
డయాగ్మెడ్ హెల్త్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్, డిస్కవర్ బయోఇన్సైట్స్, డి-నోమ్ ప్రైవేట్ లిమిటెడ్, డ్రోన్యుగ్ అన్మ్యాన్డ్ సిస్టమ్స్ ఆర్ అండ్ డి ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడిక్ట్ ల్యాబ్స్, ఎంటర్ప్రైజ్ కోషెంట్ (ఈక్యూ), ఎసెన్షియల్ వాంటేజ్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్, ఫిఫ్త్ ఓషన్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్, ఫిన్బుక్స్.ఏఐ, గ్రీన్బ్రీత్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైరింగ్హుడ్, హైలెనర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఐక్వార్క్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఎంపికయ్యాయి.
ఇతి సాగా డిజిటెక్ ప్రైవేట్ లిమిటెడ్, జీవికా ఏఐ, కైటెకి ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, కేఎల్విన్ టెక్నాలజీ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, కోడ్ బ్లూ టెక్నాలజీస్, మార్క్టెక్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, మెడ్స్టౌన్, మోధా టెక్నాలజీస్, మోయిసర్కిల్ ఫిన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్, మైఆర్ఎన్ఏ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, నోడీ (లోహాస్ వన్ ప్రైవేట్ లిమిటెడ్), ఆరిజిన్హాష్, రుబిస్కోబ్లాక్ ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీస్ అండ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ జాబితాలో ఉన్నాయి.
సెక్యూర్వీవ్ రీసెర్చ్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్కైషేడ్ డేలైట్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్పేషియల్ ఫ్లైటెక్ సొల్యూషన్, స్పోర్ట్స్లెట్, టైమ్ టు హీల్ వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్, ట్రేసర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, వాన్, వానిక్స్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, వైధ్యో హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్, డబ్ల్యూసీబీ రోబోటిక్స్ ఇండియా, వేర్సినాప్స్, జీరోమోబ్ల్ట్ మిగిలిన సంస్థలు.
