హైదరాబాద్: ప్రతి ఒక్కరిలో దాగి ఉన్న అపార శక్తిని గుర్తించి, జీవితాన్ని మార్చుకునే బాధ్యత స్వయంగా తీసుకోవాలని ఆధ్యాత్మిక వేత్త మహాత్రియా రా పిలుపునిచ్చారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఫ్లో) హైదరాబాద్ నవంబర్ 21, శనివారం సాయంత్రం హైటెక్ సిటీలోని అవాసా హోటల్లో ఈ కార్యక్రమం నిర్వహించింది.
రచయిత, ఇన్ఫినిథీయిజం వ్యవస్థాపకుడైన మహాత్రియా ‘ది ఇన్ఫినిట్ విదిన్: అవేకెన్ యువర్ లిమిట్లెస్ పొటెన్షియల్’ అంశంపై ప్రసంగించారు. ‘ఈ రోజు మామూలు రోజు కాదు. ఇది మీ జీవితంలో ఒక రోజు. దాన్ని ఏం చేసుకుంటారన్నది పూర్తిగా మీ ఇష్టం’ అని ఆయన అన్నారు.
ప్రతి మనిషికీ పరిమితులు ఉన్నా, లోపల అపరిమిత శక్తి ఉంటుందని మహాత్రియా వివరించారు. ఆ శక్తిని వెలికితీయాలంటే గట్టి నిర్ణయం, ఆచరించే సంకల్పం కావాలన్నారు. స్ఫూర్తిదాయక ప్రసంగాలు వింటేనే మార్పు రాదని, మనసారా కోరుకుని నిరంతరం ఆచరించినప్పుడే అది సాధ్యమని స్పష్టం చేశారు.
పరిణతి, విలువలు, ఆధ్యాత్మిక సమన్వయంతో సాగే జీవితం రాబోయే తరాలకూ మంచి వారసత్వాన్ని అందిస్తుందని ఆయన చెప్పారు.
మహాత్రియా రా సవాల్: 2026లో మిగిలిన 40 రోజులు కొత్తగా గడపండి
సంవత్సరం ఇప్పుడే మొదలైనట్టుగా 2026లో మిగిలిన 40 రోజులను గడపాలని ఆయన సభికులకు సవాల్ విసిరారు. పాటించాల్సిన ఒక మంచి అలవాటును ఎంచుకుని తప్పకుండా ఆచరించాలని సూచించారు. అదే సమయంలో సరికాదని తెలిసిన ఒక అలవాటును వదులుకోవాలన్నారు.
రోజూ గంటసేపు వ్యాయామం, కొన్ని నిమిషాలు మౌనంగా, నిశ్చలంగా గడపడం అనే రెండు నియమాలను మహాత్రియా సూచించారు. మౌన స్థితిలో మనిషి దైవ సందేశాన్ని మరింతగా గ్రహించగలుగుతాడని చెప్పారు. శారీరక ఆరోగ్యానికి, అంతర్గత వికాసానికి మధ్య సమతుల్యం అవసరమన్నారు.
ఒకేసారి ఎన్నో మార్పులకు ప్రయత్నించకుండా ఒక్కో మార్పుపై పూర్తిగా దృష్టి పెట్టాలని ఆయన సలహా ఇచ్చారు. మార్పు నిలవాలంటే స్థిరత్వం, వేడుక, అవిభక్త శ్రద్ధ అవసరమని తెలిపారు. ఎంత చేశామనో, ఎంత చక్కగా చేశామనో కాకుండా రోజూ చేయాలన్న నిబద్ధతే విజయాన్ని నిర్ణయిస్తుందన్నారు.
చిన్నగానైనా సరే, మొదలుపెట్టాలని మహాత్రియా పిలుపునిచ్చారు. ప్రతి చిన్న మైలురాయినీ గుర్తించి ఆస్వాదించడమే వేడుక అని, అవిభక్త శ్రద్ధ ఒక రకమైన భక్తి అని వివరించారు. తమను తాము నిరంతరం సవాల్ చేసుకునేవారిలో ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని ముగించారు.
ఆధ్యాత్మిక అన్వేషణను భౌతిక ఆకాంక్షలతో మేళవించే వ్యక్తిగా మహాత్రియాకు పేరుందని నిర్వాహకులు తెలిపారు. ప్రసంగాలు, రిట్రీట్లు, ‘అన్పోస్టెడ్ లెటర్’ సహా ఎక్కువగా అమ్ముడైన పుస్తకాలతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ఆయన ప్రభావితం చేశారని పేర్కొన్నారు. వ్యాపారవేత్తలు, పరిశ్రమ నేతలు, ఉద్యోగులు, విద్యార్థులు ఆయన మార్గదర్శనం కోరుతుంటారని చెప్పారు.
ఫ్లో హైదరాబాద్ శిక్షణతో 4,400 మందికి పైగా లబ్ధి
ప్రతి గొప్ప మార్పు మనలోనే మొదలవుతుందని ఫ్లో హైదరాబాద్ చైర్పర్సన్ సీతా రెడ్డి అన్నారు. లోకం ఏదైనా విజయాన్ని చూసే ముందే, మనిషి నిశ్శబ్దంగా తనలో లోతైన శక్తిని కనుగొంటాడని చెప్పారు. ఈ ఏడాది విద్య, నైపుణ్యాభివృద్ధి, సాంకేతికత, జీవనోపాధి కార్యక్రమాలతో మహిళలు, యువత సాధికారత కోసం సంస్థ కృషి చేసిందని ఆమె వివరించారు.
ఆర్థిక స్వావలంబన, వృత్తిపరమైన విజయానికి మించి ఆత్మవిశ్వాసం, స్పష్టత, లక్ష్యం, అంతర్గత బలం పెంపొందించడమే నిజమైన సాధికారత అని ఫ్లో హైదరాబాద్ పేర్కొంది.
టాలీ ప్రో, ఎంఎస్ ఆఫీస్, అడ్వాన్స్డ్ ఎక్సెల్, కృత్రిమ మేధ టూల్స్‌లో సర్టిఫైడ్ కోర్సుల్లో 2,600 మందికి పైగా విద్యార్థులు, మహిళలు శిక్షణ పొందారు. టాలీ ప్రో కోర్సులు పూర్తి చేసినవారిలో 80% మందికి ఉద్యోగాలు వచ్చాయి.
స్టెమ్, బయోటెక్నాలజీ ఆధారిత సర్టిఫైడ్ కోర్సులు, హ్యాకథాన్లు, స్ప్రింట్ల వల్ల 800 మందికి పైగా విద్యార్థులు లబ్ధి పొందారు. వీరిలో ఎక్కువమంది సర్టిఫికేషన్ తర్వాత ఉద్యోగాలు సంపాదించారు. వృత్తి శిక్షణ, జీవనోపాధి కార్యక్రమాలతో 1,000 మందికి పైగా మహిళలు, కళాకారులకు ప్రయోజనం కలిగింది. చేనేత కార్మికులు, హస్తకళాకారులకు ఆదాయ అవకాశాలు, ఆర్డర్లు దక్కాయి.
